పండుగలు

వైకుంఠ ఏకాదశి

blank

అనంతమైన కాలం భగవత్‌ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. ”మాస చతుర్ధా… సావన: సౌర చాంద్రో నాక్షత్ర ఇతి” అని నిర్ణయ సింధులో పేర్కొబడింది. సావనము, సౌరము, చాంద్రము, నక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విదియాది తిథులు చాంద్రమానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు. సౌర మాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి, అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్‌ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా

”రవే: సంక్రమణం రాశౌ సంక్రాంతి రిధి కథ్యతే”.

ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్పబడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14 నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16వరకు ఉత్తరాయణం, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా చెప్పబడింది. సౌర కాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉష:కాలం. ”బ్రాహ్మ ముహూర్తే బుద్ధేత ధర్మారౌ చాను చింతయేత్‌” అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోద యంలో ఉష:కాల షోడశోపచార పూజలు చేసి, పులగం-పొంగలి-శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును.

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమాన మైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ”గృహస్థో బ్రహ్మచారీ చ ఆహతాగ్నిస్థ థైవచ: ఏకాదశ్యాంశ భుంజిత పక్ష యోరు భయోరపి”అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హూత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసా ద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి హరి వాసరముగా కొనియాడబడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గ శీర్షము లేక పుష్య మాసం) వైకుంఠ ఏకాదశిగా పిలువ బడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది.

”ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిధౌబీ త్రింషత్‌ కోటి సు: సాకం బ్రహ్మ వైకుంఠ మాగత: పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు: ద్వారే తత్ర విషాదభావ మనసా సూక్ష్మర్‌ హరిం తుష్టువు: శుకై: శ్రీ: హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్ధితే, తేభ్యోదాత్‌ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:”…రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయిం పగా….ఆ దేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమును చేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహిత (5)నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్య రూపధారులై దివ్యజ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని ”మోక్షోత్సవ దినము”గా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ”ముక్కోటి ఏకాదశి”గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక ”వైకుంఠ ఏకాదశి”గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున ”భగవదవలోక దివసము”గా కొనియాడ బడుచున్నది. ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్ని మారులు పుష్యమాస మందు రావడం చేత రెండు మాసాల శుక్ల ఏకాద శులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని ”మోక్షైకాదశి” అని, పుష్యమాస ఏకాదశిని ”పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమ”ని పిలుస్తారు. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుని చేరుతుండగా, బహుళ ఏకాదశి నాడు చంద్రుని నుండి పదకొండవ కళ సూర్య మండలాన్ని చేరుతుంది.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
పండుగలు

దీపాల పండుగ దీపావళి | భారతదేశంలో దీపావళి ఎలా జరుపుకుంటారు

  • September 30, 2024
దీపాల పండుగ అని కూడా పిలువబడే దీపావళిని ప్రతి అక్టోబర్ జరుపుకుంటారు. ‘దీపావళి’ అనే పదం సంస్కృత పదం ‘దీపావళి’ నుండి ఉద్భవించింది, ఇక్కడ ‘దీపా’ అంటే
blank
పండుగలు

దసరా యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్ర

  • September 30, 2024
విజయదశమిని దసరా లేదా నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం అంతటా భక్తి విశ్వాసాలు మరియు ఆనందంతో చెడుపై మంచి విజయాన్ని వర్ణిస్తూ జరుపుకుంటారు. విజయదశమి