అద్వితీయ కేరళ యాత్ర: రుచుల పండుగ, ప్రకృతి సౌందర్యం, సంస్కృతి వైభవం

కేరళ భోజనం నిజంగా భలే పసందు. ఇటీవల కేరళ వెళ్లినప్పుడు త్రివేండ్రం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్‌లో దిగాం. అక్కడి వాళ్లను సమీపంలోని మంచి వెజ్ హోటల్ ఏంటని అడిగితే, మదర్స్ వెజ్ రెస్టారెంట్‌ని సూచించారు.
మేము ఐదుగురం అక్కడ భోజనం చేశాం. పెద్ద అరటিআకు పరిచి వడ్డించారు. భోజనం ధర రూ.250 అయినా, దాదాపు 36 రకాల వంటకాలు వడ్డించడం విశేషం. రెండు కూరలు, పప్పు, నాలుగు రకాల పచ్చళ్లు, నాలుగు రకాల సాంబారు, పులిహోర, బిర్యాని, రైతా, నాలుగు రకాల పాయసం ఇలా ఏమేమీ లేకుండా వడ్డించారు. ముఖ్యంగా పాయసాలు అమోఘం. అందులో ఇచ్చిన పెద్ద ఓలిగలు మరింత రుచి. ఆ ఓలిగలో పలుచని సేమ్యా పాయసం లేదా తేనె వేసుకుని తింటే అద్భుతం.
కేవలం ఒక చిన్న లోపం – బియ్యం కొంచెం గట్టిగా (దుబ్బగా) అనిపించింది. అది కేరళ రైస్, అక్కడివాళ్లు ప్రధానంగా అదే వాడతారట. బియ్యం మృదువుగా ఉండి ఉంటే మరింత ఆనందంగా ఉండేది. పెరుగు ఇవ్వకపోవడం కూడా చిన్న నిరాశ. పదిసార్లు అడిగితే చిన్న కప్పులో మజ్జిగ ఇచ్చారు.
మన సమావేశాల్లో కూడా ఇదే తరహా భోజనం వడ్డించారు, అయితే అక్కడ సన్న బియ్యం, సరైన పెరుగు ఇచ్చారు.
కేరళ భోజనాల్లో మరో ప్రత్యేకత — చల్లని నీళ్లు ఇవ్వరు, వేడి నీళ్లు ఇస్తారు. కొన్నిచోట్ల సుగంధ ద్రవ్యాలు కలిపిన వేడి నీళ్లు కూడా అందిస్తారు.
కేరళలో చిన్న పరిశ్రమలుగా చాక్లెట్లు తయారవుతాయి, అవి ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే అరటికాయ చిప్స్ కూడా ప్రసిద్ధి. కేరళ అంటే ఆయుర్వేదం, కషాయాలు, ప్రకృతి చికిత్సాలయాలు ప్రత్యేకం. దీర్ఘకాలిక అనారోగ్యాలకు దేశవ్యాప్తంగా నుండి ఎంతోమంది చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు.
సముద్రతీర ప్రాంతం కావడంతో సీ ఫుడ్స్ కూడా చవకగా లభిస్తాయి. చేప కర్రీలు అక్కడ ప్రసిద్ధి. త్రివేండ్రం చుట్టూ నాలుగైదు అందమైన బీచ్‌లు ఉన్నాయి. అందులో కోవలం బీచ్ ప్రముఖమైనది. మరో బీచ్‌లో గంగా తోలుని శివుడి భారీ విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. లైట్ హౌస్ ఉన్న బీచ్‌లో మెట్లు ఎక్కి ఎత్తునుండి సముద్రాన్ని చూడటం అద్భుత అనుభూతి.
కేరళను దేవభూమి అంటారు. ఎందుకంటే అక్కడి సహజసౌందర్యం, పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, అరటిచెట్లతో నిండిన ప్రదేశాలు చూడగానే మనసు పరవశిస్తుంది. అదనంగా, భారతదేశంలోని అత్యంత ధనవంతుడిగా పరిగణించే అనంత పద్మనాభస్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది. ట్రావెన్కోర్ సంస్థానం నిర్వహిస్తున్న మ్యూసియం తప్పక చూసే ప్రదేశం. అప్పటి రాజుల వైభవం చూడగానే తెలుస్తుంది.
ఇటీవల మా సీనియర్ జర్నలిస్టుల సమావేశం కూడా కేరళలో జరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల నుండి జర్నలిస్టులు పాల్గొన్నారు. మొదటి రోజు త్రివేండ్రం నందు కేరళ ముఖ్యమంత్రి గారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు. ఆశ్చర్యం కలిగించింది ఏమంటే — ఒక్క గన్‌మెన్, ఒకే కారు, ఎలాంటి ఆర్భాటం లేదు, అధికారదర్పం లేదు. ఎంత వినమ్రత, ఎంత సరళత!
మొత్తానికి, కేరళ అనుభవం ప్రకృతి, సంస్కృతి, ఆతిథ్యసత్కారం, ఆహారం—all కలిసి మరిచిపోలేని ప్రయాణం.
