జైశ్రీకృష్ణ (God)power

ఏ మనిషీ కూడా ఈ భూమ్మీదకు వచ్చి ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు.
కొద్దో గొప్పో ‘దివ్యశక్తి సంపన్నుడు’ కావాలి. ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తంచేసి తిరుగుపయనం కావాలి. అదే అతడి ‘శాశ్వత సంపద’.
మనిషిని దేవుడు పూర్తిగా తన పనిలోనే ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు.
మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు.
’శరీరం ఒక ఊబి’ అంటాడు అరవిందుడు. అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం. ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం. ఇప్పుడైనా శరీరాన్ని (శరీర భావాన్ని) వదిలి ఆత్మ వైపు తిరగడం (ఆత్మావలోకనం) అత్యవసరమని మనిషి గ్రహించి, ఆత్మజ్ఞానం పొందిన రోజునే అతడి జన్మ సార్థకమౌతుంది.
శరీరాన్ని చూసుకుని అందంగా ఉన్నదని మురిసిపోవచ్చు. శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు. కానీ…’ఈ శరీరం దేనికి’ అని ఎప్పుడైనా నిజాయతీగా ప్రశ్నించుకోవాల్సిందే.?
మానవశరీరం రావడం అదృష్టం. శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి.
శరీరం “నేను” కాదని తెలుసుకోవాలి. శరీర ప్రయోజనం తెలుసుకోవాలి. శరీరబంధం తాత్కాలికమని గ్రహించాలి. ఈ శరీరాన్నుపయోగించి ఇతరులకు సాయపడటం మంచిదే. ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలంఉండాలి. వాళ్లు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి. పుట్టుక కోసం, మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ.
శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు. శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు. “శరీరం జడం. అది శవం లాంటిది. నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు” అంటారు ‘రమణ మహర్షి’.
నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి, జీవన పరమార్థం నెరవేర్చుకోవాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందరూ ముక్తిని సాధించలేరు. ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులం కాగలిగే అవకాశముంది అందరికీ.
l ఈ శరీరంతో తిరుగుతూనే ఉన్న మనం కాస్త దారి మార్చి, ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు.
అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది. మనసు సారవంతమవుతుంది.
కొంతకాలం తర్వాత పచ్చటి ‘ఆత్మపంట’ పండుతుంది. దయతో, ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి, ఆత్మను శక్తిసంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది.
దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్నిస్తూనే ఉంటుంది.
మనం మన నేత్రాలను ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం, హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందాన్నిస్తాయి.
ఒకనాటి ఉదయం మట్టిలో నాటిన విత్తనం మూడోరోజు మొలకగా కనిపిస్తుంది. నల్లటి కారుమబ్బు వద్దన్నా జలజలా చినుకులు రాలుస్తుంది. ప్రకృతిలో ప్రతీది సహజంగా జరిగిపోయే ఏర్పాటు ఉంది.
జీవితమూ అంతే. అది జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. అష్టాంగ యోగ మార్గాలు, అష్టాదశ పురాణాల్లో మంచి విషయాలు దివ్యంగా జీవించే నరుడి ముందుకొచ్చి దర్శనం ఇస్తాయి.
’ఆధ్యాత్మిక సాధన’లో యమ-నియమాలు ముందుగా చెప్పి తరవాత సాధన క్రమం అంతా చెబుతారు. మంచితనం లేనివాళ్లకు యోగం అబ్బదు.
చెడ్డవాళ్లకు ఆలోచనలు అడ్డగించడం వల్ల ధ్యానం కుదరదు.
మానసిక పరిశుభ్రత లేనివారికి, భక్తి లేనివారికి జ్ఞానం ఒంటపట్టదు.
జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి.
జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. జీవితం ఈశ్వర ప్రసాదం.
భక్తిగా రెండు చేతులు పైకెత్తి దివ్యజీవనాన్ని ఆహ్వానించాలి. ఆటుపోట్లతో, హెచ్చుతగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా దైవప్రసాదం గా జాగరూకతతో అనుభవించాలి. నిజమైన సాధన ఇదే.
ఊపిరి ఆపడం, భూమిలోకి దిగబడిపోవడం, ముళ్లమీద పడుకోవడం వంటి యోగ సాధనాలు తీవ్ర అభ్యాసం వల్ల వస్తాయి. .
శరీర అంతర్గత శక్తులు ద్యోతకం అవుతాయి. మేధ వికసించి ఆత్మావలోకనం కలుగుతుంది.
జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన ఉన్నత శిఖరాలకు చేరినట్లే.
ఒక దీపం మరోదీపం వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో వెలుగుని నింపాలి. అంతకంటే మనిషి జీవితానికి సార్థకత లేదు.
