భాద్రపద మాస విశిష్టత

శ్రావణమాసం ముగిసి, మంగళగౌరి నోములు, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారినట్టే అనిపిస్తుంది.
అయినా… శ్రావణం తరువాత వచ్చే భాద్రపదమూ విశేషమే!
భాద్రపద మాసం ఎందుకు ప్రత్యేకం?
చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాభాద్ర / ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటంతో దీనికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది.
ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ఆరోగ్యం, ధన సమృద్ధి కలుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఉప్పు, బెల్లం దానాలు కూడా ప్రత్యేక ఫలితాన్నిస్తాయని పండితుల అభిప్రాయం.
ముఖ్యంగా ప్రజలు “భద్రంగా ఉండాలి” అన్న ఆలోచనతో ఈ మాసం ఆచారాలు ఏర్పడ్డాయి.
భాద్రపదంలో ముఖ్యమైన పండుగలు & వ్రతాలు
- వినాయక చవితి – శ్రీ గణపతి ఆవిర్భావ దినం. 21 రకాల పత్రాలతో గణనాథుని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతారు. విద్యార్థులు పుస్తకాలు పూజిస్తారు.
- సువర్ణ గౌరీ వ్రతం – శుక్ల తదియ నాడు స్త్రీలు ఉపవాసం చేసి, ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి పూజ చేస్తారు.
- ఋషి పంచమి – స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక వ్రతం. తెలియక చేసిన పాపాలు తొలగుతాయని పురాణవచనం.
- రాధాష్టమి – శ్రీకృష్ణ-రాధాదేవులను పూజించే రోజు. పెరుగు దానం విశేష ఫలితాన్నిస్తుంది. దాంపత్య సౌఖ్యం కలుగుతుందని విశ్వాసం.
- పరివర్తన ఏకాదశి – శ్రీమహావిష్ణువు శయనావస్థలో పక్కకు తిరిగే రోజు. ఈ వ్రతం కరువు, కాటకాలు తొలగిస్తుందని చెబుతారు.
- వామన జయంతి – వామనుడి ఆవిర్భావ దినం. విజయం, విజయతీర్థం కలుగుతుందని విశ్వాసం.
- అనంత చతుర్దశి – శ్రీ అనంత పద్మనాభుని పూజించే రోజు. ఐశ్వర్యం, సుఖసంపదలు కలుగుతాయి.
- ఉమా మహేశ్వర వ్రతం – భక్తి శ్రద్ధలతో ఆచరించినవారికి అపారమైన ఐశ్వర్యం ప్రసాదమవుతుంది.
- ఉండ్రాళ్ల తద్ది – స్త్రీలు గౌరీ దేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి భర్త, దాంపత్య సౌఖ్యం కోసం ఆచరిస్తారు.
పితృ పక్షం (మహాలయ పక్షం)
భాద్రపద పూర్ణిమ అనంతరం మహాలయ పక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు మృతులైన పితృదేవతలకు తర్పణాలు, శ్రద్ధ, దానధర్మాలు తప్పనిసరిగా చేయాలి.
భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజున పితృకార్యాలు విశేష ఫలితాన్నిస్తాయని పురాణవచనం.
ముగింపు
మొత్తానికి – భాద్రపద మాసం ఆధ్యాత్మికత, వ్రతాచారాలు, పండుగలతో నిండిన పవిత్రమైన కాలం. ఈ మాసంలో దానధర్మాలు మరింత విశేష ఫలితాలను ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు.
✍️ – వాసు ముక్తినూతలపాటి