పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు

పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు?
పితృదేవతారాధనా రహస్యాలు
‘‘ఏడు తరాలు‘‘ అనే మాట తెలియని హిందువు ఉండడు. కానీ ఆ ఏడు తరాలు ఏమిటో చాలా మందికి తెలియదు. ఇది తెలియాలంటే దుర్గాదేవి నుంచీ ఉద్భవించిన ఈ క్రింది దేవీశక్తుల గురించి తెలుసుకోవాలి.
వేదాలలో పురాణాలలో ఎన్నో రహస్యాలు సముద్రంలోని రత్నాల మాదిరిగా దాగి ఉన్నాయి. ఈ సంగతి వరాహస్వామి వరాహపురాణంలో స్వయంగా చెప్పాడు. ‘‘వేదాల్లో ఎన్నో విధాలైన సుదుర్లభమైన రహస్యాలున్నాయి. వాటిలో నీవు ఏవి వినాలనుకుంటున్నావో వాటిని కోరుకో చెబుతాను‘‘ అని నారదుడితో అన్నాడు.
ఆ మీదట నారదుడు స్వాహా, స్వధాల గురించి అడిగాడు. వీరిని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని కోరగా అతిరహస్యమైన వారి జన్మవృత్తాంతాలు వరాహస్వామి చెప్పాడు.
సృష్టి ప్రారంభంలో సమస్తమూ సృష్టించిన మహేశుడు తానే స్వయంగా యజ్ఞరూపమై ఆవిర్భవించాడు. యజ్ఞంలో వచ్చే హవిస్సులు దేవతలకు చెందుతాయని అన్నాడు. అయితే వారు హవిస్సులు దేవతలు పొందలేకపోయారు. ఇది గమనించిన సృష్టికర్త దుర్గాదేవిని ప్రార్ధించడంతో అద్భుతమైన సౌందర్యరాశి ఉద్భవించింది. ఆమెను చూసి పరమానందభరితుడైన విధాత ఆమెను స్వాహాదేవి అనే పేరుతో పిలిచి అగ్నిదేవుని భార్యవు కావాలని కోరాడు. స్వాహాదేవిని మంత్రం చివర ఉచ్చరించి దేవతలకు ఆహుతులు ఇస్తే అవి వారికి చెందుతాయని చెప్పాడు. మంత్రం చివర స్వాహా అని లేకపోతే అది నింద్యమైనది అవుతుంది. అంబిక నుంచీ పుట్టిన స్వాహాదేవి అగ్నిదేవుని సర్వసంపత్తి. అగ్నికి ఉన్న అపారమైన శక్తి ఆయన దాహంలో ఉంది. ఆ దాహశక్తే స్వాహాదేవి.
ఆమెకు అగ్నిదేవునికీ సంతానంగా దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని అనే ముగ్గురు కుమారులు పుట్టారు.
ఈమె వృత్తాంతం చెప్పిన తరువాత స్వధాదేవి వృత్తాంతం చెప్పాడు.
స్వధాదేవి పితృదేవతలకు తృప్తికరమైనది. ఆమే శ్రాద్ధఫలాన్ని పెంపొందింప చేస్తుంది. ఆమే శ్రాద్ధానికి అధిష్ఠానదేవి.
సృష్టికర్త దేవతలకు హవిస్సులు చేరే మార్గం రూపొందించాక సప్తపితృగణాలను సృష్టించాడు. అంటే 7 తరాల పితృదేవతలను సృష్టించాడన్న మాట. వీరికి ఆహారంగా శ్రాద్ధతర్పకపూరకమైన ఆహారం సృష్టించాడు. అదే మనం పెడుతున్న శ్రాద్ధం. ఇవి కూడా విధాతే పితృగణాల కోసం సృష్టించాడు. ఇవి పితృయజ్ఞాలు.
ఇవి మామూలు యజ్ఞాలుగా కాకుండా ప్రత్యేకపద్ధతిలో విధాత సృష్టించాడు. కనుక ఇవి సామాన్య యజ్ఞయాగాదులకు భిన్నంగా ఉంటాయి. ఇవి కోరిన కోరికలు తీర్చడంలో సామాన్యయజ్ఞాలకన్నా శ్రేయస్కరమైనవి. పితృయజ్ఞాలలో పిండప్రదానాలు చేస్తే త్వరగా కోరికలను సిద్ధింపచేస్తారు సప్తపితరులు. వీరి ఆరాధన సంపూర్తిగా వేరేగా ఉండడం వల్ల, మరణానంతర దశదినసంస్కారాల వల్ల దేవత్వం పొందడం వల్ల, ఏ కొంచెం తప్పు జరిగినా శ్రాద్ధం పాడైపోయి ముట్టాల్సిన పితరులకు పిండప్రదానాలు ముట్టక నానారకాలచావులు పొందిన వారికి ముడతాయి కనుక చాలా మంది వీటిని అపార్ధం చేసుకున్నారు. కానీ ఇవి కూడా చండీయాగం, సుదర్శన హోమం వంటి పరమశ్రేయోదాయకమైన యజ్ఞాలే. వాటికన్నా ఎక్కువ శ్రద్ధాగా చేయాలి.
కానీ ఇంటిలోని నాయనమ్మల నుంచీ నోటితో మాట్లాడడం వచ్చిన వారి వరకూ అంతా ప్రవాచకులై భాష్యాలు చెప్పడం వలన పితృకార్యాలు అంటే విపరీత అర్ధాలు జనాల్లోకి చేరిపోయాయి. కనుక వరాహపురాణంలో ఉన్న ఈ రహస్యాలు ఆంధ్రవ్యాసులవారు చెప్పగా తెలుసుకుందాం.
దేవతల మాదిరిగా పితృగణాలకు కూడా తమకు అర్పిస్తున్న ఆహుతులు చేరకపోవడం జరిగింది. దీంతో విధాత గతంలో స్వాహాదేవిని సృష్టించినట్టే మరో దేవతను సృష్టించాడు. ఆమే స్వధాదేవి. ఆమె బ్రహ్మమానస పుత్రిక. మానవకన్య. ఈమెను పితృగణాలకు విధాత ఇచ్చాడు. ఈమె పేరైన స్వధను మంత్రం చివర ఉంచి ఆహుతులు ఇస్తే అవన్నీ పితృగణాలకు చేరతాయని ఆదేశించాడు.
అప్పటి నుంచీ పితృదేవతలకు ఇచ్చే ప్రతీ ఆహుతి, దానమూ, ఉదకమూ స్వధా నామముతో ఇస్తేనే వారికి చెందుతూ వచ్చాయి. స్వాహా అని అంటే దేవతలకు చెందినట్టు, స్వధా అని అంటే పితృదేవతలకు చెందుతాయన్నమాట.
పితృదేవతలను సంతోషపెట్టాలి అంటే స్వధాదేవిని స్మరించాలి. ఆమెను అర్చించాలి. ఆమెను కీర్తించని వాని పితృయజ్ఞం ఫలించదు.
స్వధా అనుకుంటే పితరులు సంతోషించి సమస్త సంపదలూ ఇస్తారు. మూడు సంధ్యలలోనూ స్వధా, స్వధా, స్వధా అని మూడు సార్లు అనుకుంటే మంచి భార్య వస్తుంది. మంచి పుత్రుడు కలుగుతాడు. సకల సంపదలూ కలుగుతాయి.
ఓం, స్వస్తి, నమః, స్వాహా, దక్షిణా అనే ఐదుపేర్లతో పాటు స్వధా కూడా కలిపి మొత్తం ఆరు పేర్లు నాలుగు వేదాలలో సమానంగా నిరూపితమైంది. అంటే ఓంకారంతో సమానమైన శక్తి కలది స్వధా నామం.
