☘️ కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ ☘️

విజయుడు అనే రాజు “నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?” అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! “కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో” అని “మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ” అనేసేవాడు.
⭕అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా “మీరేమంటారు మంత్రిగారూ?!” అని అడగడం మొదలుపెట్టాడు..
⭕మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. ‘ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే’ అనుకున్నాడు ఆయన.
⭕ “మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి” అని తప్పించుకున్నాడు మంత్రి.
⭕దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. ‘ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను’ అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.
⭕ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు- ఆవుల్ని మేపుకుంటూ.
⭕”ముందు వీడిని ఓడిస్తాను… నా తెలివి ముందు వీడు ఏపాటి?” అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.
⭕”నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-” అన్నాడు.
⭕పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి “సరే, అడగండి” అన్నాడు.
⭕”సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?” అడిగాడు విజయుడు.
⭕’గాలి’…. చెప్పాడు పశువుల కాపరి.
⭕అన్నింటికంటే ఉత్తమమైన జలం?
⭕”గంగాజలం”
⭕అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?
⭕” ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే”
⭕”భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!” అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.
⭕ఆ మాటలకు “హ్హ హ్హ హ్హ” అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.
⭕”ఎందుకు, అంత నవ్వుతున్నావు?” అడిగాడు విజయుడు చికాకుగా.
⭕”తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ…” అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.
⭕”మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను” అన్నాడు విజయుడు పట్టుదలగా.
⭕”సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి…” చెప్పాడు పశువుల కాపరి.
⭕”అవును నిజమే” మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.
⭕”ఇంకో సంగతి చెప్పనా?” అన్నాడు పశువుల కాపరి. “నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే ‘ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి’ అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే”
⭕విజయుడు నివ్వెరపోయాడు. “అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, ‘అందరిలోకీ తెలివైనవాళ్ళు’ అంటూ అసలు ఎందుకుండాలి?” అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.
⭕పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!
⭕అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా ” మంచి రాజు – అందరినీ ప్రోత్సహిస్తాడు” అని పేరు తెచ్చుకున్నాడు.
⭕ చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింక చదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ! వినురవేమ!
⭕భావం: ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!~~
{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి. ఇది సేకరణే…: –వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్
