జిజ్ఞాసువుల ప్రశ్నలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి సమాధానాలు :

ప్ర : శివపంచాక్షర స్తోత్రంలో ‘యక్ష స్వరూపాయ’ అని శివుని వర్ణించారు. శివుడు యక్షుడిగా ఎప్పుడు ఎలా అవతరించాడు? దాని అంతరార్థమేమిటి?
జ : ఒకప్పుడు దేవతలు రాక్షసుల్ని జయించి, విజయోత్సహాన్ని జరుపుకుంటున్నారు. అంతా తమ నిర్వాకమేనని ప్రగల్భాలను చెబుతున్న సందర్భంలో వారి ముందు పరబ్రహ్మ ‘యక్ష’ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ
తన్న వ్యజానంత కిమిదం యక్షమితి॥ (కేనోపనిషత్)
దేవతలు ఆయనను గుర్తించలేక ఈ యక్షుడెవరని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అగ్ని అతన్ని తెలుసుకోవడానికై ముందుకు వచ్చి, ‘నువ్వేవర’ని ప్రశ్నించాడు. అప్పుడా యక్షుడు దేవతల ప్రతాపాన్ని తెలుసుకోడానికి వచ్చానని చెప్పి-ఒక తృణాన్ని ఎదురుగా ఉంచి అగ్ని యొక్క ప్రతాపాన్ని చూపించమన్నాడు. అగ్ని తన శక్తినంతటినీ వినియోగించినా, ఆ తృణం దహింపబడలేదు. అలాగే వాయువు కూడా దానిని కదిలించలేకపోయింది. అప్పుడు ఇంద్రుడు వినయంగా ఆ యక్షుని ప్రార్థించగా, అక్కడ జగదంబ బ్రహ్మ విద్యాస్వరూపిణిగా సాక్షాత్కరించి ‘తాను ఉమాదేవిననీ, ఆ యక్షుడు పరమాత్మ అనీ, అతని శక్తిని’ తానని పరబ్రహ్మ గురించి బోధించింది. అలా యక్షునిగా గోచరించిన శివపరమాత్మ దేవతలకు సైతం దైవత్వాన్నిచ్చిన పరంజ్యోతి. ఇది కేనోపనిషత్తులోను, కొన్ని పురాణాలలోను చెప్పబడిన కథ. ఈ ఇతివృత్తాంతం ఆధారంగా ‘యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ’ అని శివపంచాక్షరస్తోత్రం వర్ణించింది.’యక్ష’ శబ్దానికి ‘పూజ్యుడు’ అని ఒక అర్థం ఉంది.
(‘ఋషిపీఠం’ ప్రచురణ ‘సమాధానమ్’ పుస్తకం నుండి సేకరణ)
